జన గళం అనకాపల్లి/నర్సీపట్నం డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ఉమ్మడి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పట్టు నిరూపించుకునేందుకు ఎన్డీయే కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను జనసేన, కూటమి సీనియర్ నేతలు శ్రీ కొణతాల రామకృష్ణ గారు మరియు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గార్లకు పార్టీ అధిష్టానం అప్పగించింది.
నియోజకవర్గ పరిధిలోని పురపాలక, మండల పరిషత్ (MPTC), జిల్లా పరిషత్ (ZPTC) ఎన్నికల్లో కూటమి శ్రేణులను ఏకతాటిపైకి నడిపించడం, టికెట్ల సర్దుబాటు, అసంతృప్తుల బుజ్జగింపు, సమన్వయ లోపాలు లేకుండా క్షేత్రస్థాయి ప్రచారాన్ని పర్యవేక్షించే బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబులకు ఈ బాధ్యతలు అప్పగించడంతో నర్సీపట్నం కూటమి క్యాడర్‌లో నయా జోష్ నెలకొంది. నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థల స్థానాల్లో కూటమి అభ్యర్థుల భారీ విజయమే లక్ష్యంగా త్వరలోనే విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి సమగ్ర కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
