అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన, మరణాల ఆలస్య నమోదు ప్రక్రియపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ను ఉటంకిస్తూ జనన, మరణాల నమోదు చట్టంలోని సెక్షన్-13 నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ శాఖ) శ్రీ ఆర్.పి. సాయిప్రసాద్ గారు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం, జనన లేదా మరణం సంభవించిన ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఆలస్యంగా నమోదు చేయాల్సి వస్తే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్), ఆర్డీవో లేదా తహసీల్దారు ఇచ్చే వాస్తవిక నిర్ధారణ ఉత్తర్వులను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.
అదేవిధంగా రెండేళ్లు దాటిన తర్వాత ఆలస్యంగా సమాచారం అందితే, ఆ ప్రాంత అధికార పరిధిలోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ క్షేత్రస్థాయి వాస్తవికతను పరిశీలించి జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో చట్టబద్ధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు అధికారాలు దఖలు పరచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మార్పులకు అనుగుణంగా సంబంధిత సాఫ్ట్వేర్, కార్యాలయ పనివిధానాల్లో తక్షణ మార్పులు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA)ను ప్రభుత్వం ఆదేశించింది.
