రచన: జన గళం బంటుమిల్లి/కృత్తివెన్ను డెస్క్: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామం వద్ద తీవ్ర విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రంగా బొమ్మ సెంటర్ సమీపంలో మార్గమధ్యలో ఆగి ఉన్న భారీ లారీని వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులు తీవ్ర రక్తగాయాల పాలయ్యారు. వాహనం ముందు భాగం లారీ కిందకు దూసుకుపోవడంతో బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది.
భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదాన్ని గమనించిన రంగా బొమ్మ సెంటర్‌లోని స్థానికులు, దుకాణదారులు వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు. రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బందికి, కృత్తివెన్ను పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన యువకులను హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చీకటి వేళల్లో సరైన పార్కింగ్ లైట్లు లేదా ఇండికేటర్లు లేకుండా రోడ్డుపై లారీని నిలిపి ఉంచడమే కాకుండా, మితిమీరిన వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కృత్తివెన్ను పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
