రచన: జన గళం అమరావతి డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీ పట్టు, క్షేత్రస్థాయి బలాబలాలు, కేడర్ సమాయత్తతపై నాయకులతో కూలంకషంగా చర్చించారు.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకుంటూ.. పార్టీలో ఇప్పటివరకు ఉన్న స్థానిక సంస్థల సమన్వయ కమిటీలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల వ్యూహాలకు అనుగుణంగా, కష్టపడి పనిచేసే నిజమైన కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ త్వరలోనే నూతన కమిటీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం పైపై లెక్కలతో కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ వాస్తవ బలాన్ని, ప్రజల్లో ఉన్న ఆదరణను సమగ్రంగా అంచనా వేసిన తర్వాతే తుది నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
