రచన: జన గళం పెడన డెస్క్: కృష్ణా డెల్టా గుండెకాయ లాంటి పెడన నియోజకవర్గంలో కరువు పరిస్థితులు తాండవిస్తుంటే, కరువు మండలాల ప్రకటనను కొందరు రాజకీయ నాయకులు తమ సొంత విజయంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పెడన మాజీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ బాబు సమ్మెట తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువు రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యమా లేక ప్రచార విజయమా అని ప్రశ్నించారు. శనివారం ఆయన పెడన నియోజకవర్గ ప్రజలు, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నాయకులను నిలదీస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
సుమారు 6.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న సస్యశ్యామలమైన కృష్ణా తూర్పు డెల్టాలో పెడన, గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ఎస్వీ బాబు నిలదీశారు. జూన్ నెలలో ఆశతో విత్తనం వేసి, నారుమళ్లు పోసి, రెండేసి సార్లు నాట్లు వేసి అప్పులపాలైన రైతు కుటుంబాల కన్నీటికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యం ఒక కారణమైనప్పటికీ, అందుబాటులో ఉన్న నీటిని సక్రమంగా నిర్వహించడంలో, కాలువలకు నీటిని విడుదల చేయడంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడిగారు. కరువు మండలాల ప్రకటన అనేది పరిపాలనాపరమైన ప్రాథమిక చర్య మాత్రమేనని, దానిపై సంబరాలు, ఫ్లెక్సీల ప్రచారాలు మాని.. ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇస్తారు? రుణాలు రీషెడ్యూల్ చేస్తారా? కౌలు రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
