జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మేయర్, చైర్మన్, కార్పొరేటర్ మరియు కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగియనుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆశావహులు భారీ సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం రేపు నామినేషన్ల పరిశీలన (స్కూటినీ) ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 21వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. నామినేషన్ల పర్వం చివరి దశకు చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
