జన గళం సోషల్ మీడియా డెస్క్: ఆధునిక సమాజంలో నిత్యం పెరుగుతున్న ధరలు, పన్నుల భారంతో నలిగిపోతున్న మధ్యతరగతి వర్గాల వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతూ నెటిజన్ మనోహర్ తోట పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధనవంతులకు అపరిమిత సంపద అండగా నిలుస్తుంటే.. మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం నెలాఖరు లెక్కలు, సర్దుబాట్లే శేషప్రశ్నగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేయాలంటే మొదట గుర్తొచ్చేది మధ్యతరగతి వాడేనని, కానీ ఏదైనా సంక్షేమ పథకం ఇవ్వాల్సి వస్తే మాత్రం వాడి ఆదాయ పరిమితులను కారణంగా చూపి పక్కన పెడుతున్నారని దుయ్యబట్టారు.
స్కూల్ ఫీజులు, ఆసుపత్రి బిల్లులు, ఇంటి ఈఎంఐలు, కరెంట్, పెట్రోల్, కిరాణా ధరల భారం అంతా సగటు మధ్యతరగతి జీవి పైనే పడుతోందని పేర్కొన్నారు. జీతం పెరిగితే పన్నుల భారం పెరుగుతుందని, ఒకవేళ జీతం పెరగకపోయినా నిత్యావసరాల ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. అటు పై అంతస్తుల్లోని సంపన్నుల స్థాయికి వెళ్లలేక, ఇటు చేతులు చాచి సాయం అడగడానికి ఆత్మగౌరవం అంగీకరించక లోలోపలే కుమిలిపోతున్నారని ఆవేదన చెందారు. సమాజం ముందు బాగానే ఉన్నట్లు నవ్వుతూ కనిపించినా, లోపల మాత్రం ప్రతి నెలా ఆర్థిక యుద్ధం చేస్తున్నారని, ఈ దేశంలో మధ్యతరగతి వాడు బతకడం లేదని.. బాధ్యతలు మోస్తూ కోరికలు చంపుకుంటూ బతికేస్తున్నాడని పేర్కొన్న వాక్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.
