జన గళం అవనిగడ్డ/కృష్ణా బ్యూరో: అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన, బీజేపీ నాయకులను కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగుతుంటే, అవనిగడ్డలో మాత్రం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తూ టీడీపీని విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఏ ఒక్క ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి తరఫున ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మండలి బుద్ధప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని తాము బలంగా గళం విప్పామని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడి, ఓట్లు వేయించి గెలిపించినందుకు తెలుగుదేశం శ్రేణులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు. ఎవరితోనైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే అవి సొంత విషయాలకే పరిమితం చేసుకోవాలని, వాటిని పార్టీకి ఆపాదించి కార్యకర్తలను విస్మరించడం కూటమి ధర్మం కాదని స్వర్ణలత హితవు పలికారు.
