జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ రాజకీయ ప్రాబల్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు యనమల కృష్ణుడు నేతృత్వంలో తుని పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. శుక్రవారం తుని పట్టణంలోని సాయి వేదిక ఫంక్షన్ హాల్ వేదికగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో తుని రూరల్, కోటనందూరు, తొండంగి ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వేల మంది ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడంతో స్థానిక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.
సాయి వేదిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి సమక్షంలో తుని జనసేన నేతలు యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, చోడిశెట్టి గణేష్ నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయి నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన జనసైనికులు, అభిమానులతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ సంబరాలే నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ పెరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలు పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులవుతున్నారని వెల్లడించారు. ఈ రోజు జరిగిన చేరికల కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. అతి త్వరలోనే తుని రాజా మైదానంలో అత్యంత భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ఆ సభ ద్వారా మరొక ఐదు వేల మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేలా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
