జన గళం కృష్ణా జిల్లా డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీలలో కృష్ణా జిల్లాలో పర్యతించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి లా అండ్ ఆర్డర్, పోలీస్ బందోబస్తు, ప్రోటోకాల్, విద్యుత్ సరఫరా, అగ్నిమాపక రక్షణ, రవాణా, వైద్యం, ఆహార భద్రత, పారిశుద్ధ్యం మరియు విమానాశ్రయ భద్రత తదితర అన్ని అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, రాకపోకల మార్గాలు మరియు పార్కింగ్ ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని ఆదేశించారు. పోలీస్ శాఖ ఇతర విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకొని ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
అలాగే, గ్రీన్ రూమ్‌ల ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయ జనరేటర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, అత్యవసర వైద్య బృందాలు మరియు అంబులెన్సులు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార భద్రత మరియు నాణ్యత విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె. లక్ష్మీకాంతరెడ్డి, విమానాశ్రయ సీఎస్‌వో కె. ధర్మేంద్ర, ఇంటెలిజెన్స్ విభాగం అధికారి చప్పిడి రాజా, జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్య కిషోర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Slug: gannavaram-airport-president-droupadi-murmu-visit-arrangements-collector-balaji
