జన గళం ఆధ్యాత్మిక డెస్క్: దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వట్టికుట్టి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి తన సతీమణితో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన కమిషనర్ దంపతులకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్, జనసేన పార్టీ నాయకులు అజయ్ వర్మ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, అర్చకులు సైతం కమిషనర్ దంపతులకు సాదర ఆహ్వానం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
శరన్నవరాత్రుల విశిష్ట అలంకారంలో భక్తులకు కొలువుదీరిన దుర్గమ్మ మూలవిరాట్ను చక్రవర్తి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగమండపంలో వేద పండితులు కమిషనర్ దంపతులకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ వర్గాలు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశాయి.
