జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మృతి పట్ల కాపు జేఏసీ రాష్ట్ర చైర్మన్ చందు జనార్దన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివాదరహితుడిగా, నిరాడంబర నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆళ్ల నాని మరణం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆళ్ల నాని చేసిన సేవలు ఎనలేనివని చందు జనార్దన్ గుర్తుచేసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు విశేష సేవలందించిన మానవతావాది అని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
