జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మరణం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆళ్ల నానితో తనకు ఎన్నో ఏళ్ల నుంచి అత్యంత ఆత్మీయమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
తమ కుటుంబానికి సమీప బంధువైన ఆళ్ల నాని, గతంలో తనతో పాటు సహచర శాసనసభ్యునిగా అసెంబ్లీలో పనిచేశారని పేర్కొన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరితో ఎంతో కలివిడిగా, ఆప్యాయంగా ఉండే అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతమని కొనియాడారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉండి, ఇంకా ఎంతో ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉన్న తరుణంలో ఆయన అకాల మరణం చెందడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
