జనసైనికులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
- ఆత్మగౌరవాన్ని భంగపరిస్తే ఎంతటి వారైనా కొమ్ములు విరవాలి
- కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలను గౌరవించాల్సిందే
- నాగాయలంక మండల పరిషత్‌పై జనసేన జెండా ఎగరాలి: స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం
నాగాయలంక (అవనిగడ్డ):
జనసైనికులు తమ ఆత్మగౌరవాన్ని ఎవరి వద్దా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం నాగాయలంకలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జనసేన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసైనికులు ఎవరినీ ‘దేహీ’ అని అడగాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. ఎవరినైనా ఓడించే శక్తి, గెలిపించే సత్తా జనసేన కార్యకర్తలకు ఉందన్నారు. జనసైనికుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా వారి కొమ్ములు విరవాల్సిన బాధ్యత మనపై ఉందని హెచ్చరించారు. అవమానకరంగా మాట్లాడే వారికి తలొగ్గాల్సిన పని లేదని, దాసోహం అనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో జనసైనికుల పాత్ర అత్యంత కీలకమని, వారిని సముచితంగా గౌరవించకుండా వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో జనసైనికుల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా కాపాడుకోవడం తన బాధ్యత అని భరోసా ఇచ్చారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాగాయలంక మండల పరిషత్‌పై జనసేన జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీకి కేటాయించే ప్రతి సీటులోనూ తిరుగులేని విజయం సాధించేలా గ్రామాల వారీగా పక్కా వ్యూహరచన చేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు నిరంతరం ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో పనిచేసి ప్రజా నాయకులుగా ఎదగాలని, పోరాట పటిమతోనే నిజమైన గుర్తింపు లభిస్తుందని సూచించారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగమల్లికార్జునరావు (చినబాబు), పీఏసీఎస్ చైర్మన్లు తోట శ్రీనివాసరావు, ముమ్మారెడ్డి శ్రీనివాసరావు, మాజీ సర్పంచులు మండలి ఉదయ భాస్కర్, అంబటి శ్యాంప్రసాద్, మండల పార్టీ నాయకులు భోగాది శివవిష్ణు, బండ్రెడ్డి హరి, మండల ఉపాధ్యక్షులు బొడ్డు విజయ్, జిల్లా కార్యదర్శి పద్యాల వెంకట ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ పిరాటి శిరీష, సైకం నాగబాబు, నీటి సంఘ అధ్యక్షులు అవనిగడ్డ వెంకటేశ్వరరావు, నాయుడు బాబూరావు, బావిరెడ్డి రవీంద్ర, అలపర్తి సుబ్రహ్మణ్యం, నాయకులు సువర్ణరాజు, కమతం నరేష్, సనకా శేషు, ముమ్మారెడ్డి సురేష్, తోట మానస, నాగేంద్రవర్మ, సూర్య మరియు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన జనసేన పార్టీ ఎస్సీ, బీసీ విభాగాల నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
