జన గళం విజయవాడ పశ్చిమ బ్యూరో: రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ బిల్డప్‌లు ఇవ్వడం మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఆయన కార్పొరేటర్ల ముఠాకు జనసేన పార్టీ నాయకుడు అజయ్ వర్మ ఠాకూర్ ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఐదేళ్లపాటు మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వెల్లంపల్లి, ఆయన అండతో కార్పొరేటర్లు సాగించిన దౌర్జన్యాలు, భూకబ్జాలు, బలవంతపు వసూళ్ల దందాలను పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదని మండిపడ్డారు.
సామాన్యుడు కష్టపడి ఇల్లు కట్టుకోవాలని రోడ్డుపై ఇసుక, కంకర వేస్తే చాలు వెల్లంపల్లి అనుచరగణం వాలిపోయి బెదిరింపులతో ముక్కుపిండి వసూళ్లు చేశారని ఆయన ధ్వజమెత్తారు. చిరువ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు సెటిల్‌మెంట్లు చేయడం, పేదల స్థలాలను కబ్జా చేయడం, ప్రశ్నించిన వారిపై మంత్రి అండతో పోలీసులను దుర్వినియోగం చేస్తూ రౌడీషీట్లు తెరిపిస్తామని బెదిరించడం వంటి అరాచకాలు సాగించారని విమర్శించారు. అభివృద్ధిని గాలికొదిలేసి కార్పొరేషన్ నిధులను సైతం కమిషన్ల రూపంలో దోచుకున్న చరిత్ర వారిదని గుర్తుచేశారు. ఇప్పుడు రోజులు మారాయని, బెదిరింపుల కాలం చెల్లిపోయిందని స్పష్టం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వెల్లంపల్లి వర్గానికి డిపాజిట్లు కూడా దక్కవని, ఇంకా అహంకారంతో వీధుల్లో తిరిగితే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని అజయ్ వర్మ ఠాకూర్ హెచ్చరించారు.
