జన గళం విజయవాడ/రాజకీయ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రేషన్ బియ్యంతో కనీసం అట్లు (దోశలు) కూడా వేసుకోలేని దయనీయ స్థితి నెలకొందని, ఫలితంగా పేద కుటుంబాలకు ఆర్థిక నష్టమే మిగులుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోతిన వెంకట మహేష్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో నిలదీశారు.
పేద ప్రజలు రేషన్ బియ్యాన్ని పిండి చేసి అట్లు వేసుకుందామనుకుంటే.. 2½ కిలోల రేషన్ బియ్యం, ½ కిలో మినప్పప్పు, 100 నుంచి 125 గ్రాముల నూనె, గ్యాస్ ఖర్చులతో పాటు మహిళల సమయం, శ్రమ వృథా అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఖర్చు చేసిన తర్వాత కూడా నాణ్యమైన అట్లు రాకపోవడంతో సామాన్య గృహిణులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. పేదవాడి కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అదనపు ఖర్చుల భారం కాకూడదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం నాణ్యత, సరఫరా విధానంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదవాడి హక్కు అయిన రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్లి అక్రమ సంపాదనకు మార్గంగా మారకుండా కఠిన తనిఖీలు చేపట్టాలని, పేద ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని పోతిన మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
