జన గళం విజయవాడ డెస్క్: దసరా శరన్నవరాత్రుల పర్వదినాల వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రముఖ సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘రణబలి’ ఘన విజయం సాధించిన సందర్భంగా, విజయవాడ ఉత్సవ్ వేడుకలలో భాగంగా వారు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులకు ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్న నూతన దంపతులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. దసరా పండుగ వేళ దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని, దివ్యమైన అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
