జనగళం 24 ఆంధ్ర డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు, సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో సుమారు కోటీ ఇరవై ఒక్క లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఆరోగ్య కేంద్రం భవనం వంటి శాశ్వత పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
