జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమరంలో భాగంగా 32వ డివిజన్లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. గత వైసీపీ పాలనలో సాగిన అవినీతి, అరాచకాలను ఎండగడుతూ ఎన్డీయే కూటమి శ్రేణులు ప్రజాక్షేత్రంలో గళమెత్తాయి. 2021లో కార్పొరేటర్‌గా గెలిచిన నాటి వైసీపీ ప్రతినిధి అధికారం తలకెక్కి దేవుడి ఆలయాలను కూడా వదలకుండా సాగించిన విధ్వంసాన్ని ఓటర్లు ఒక్కసారి గుర్తుచేసుకోవాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు.
విద్యాధరపురం రావి చెట్టు సెంటర్ వద్ద రామాలయం, శివాలయం నిర్మాణం జరుగుతుంటే.. తమకు లంచం ముట్టలేదన్న అక్కసుతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ను పంపించి, పవిత్రమైన గుడి సెంట్రింగ్‌ను బలవంతంగా లాగేయించిన చరిత్ర వైసీపీదని దుయ్యబట్టారు. నాటి దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లోనే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ దౌర్జన్యం సాగిందని మండిపడ్డారు. గుడికే లంచాలు అడిగినవారు కొండ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా వసూళ్లకు పాల్పడి కంటతడి పెట్టించారని ఆరోపించారు. మళ్లీ ఓట్ల కోసం వస్తున్న అటువంటి అరాచక శక్తులకు బుద్ధి చెప్పి, ధర్మం మరియు అభివృద్ధి పక్షాన నిలిచే కూటమి అభ్యర్థికి మద్దతు పలకాలని ఓటర్లను కోరారు.
Slug: vmc-elections-32nd-division-ysrcp-corruption-temple-demolition-expose-nda-alliance
