జన గళం కృష్ణా జిల్లా డెస్క్: పెడన పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెడన పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బళ్ల జ్ఞాన లింగ జ్యోత్స్నారాణి, ఆమె భర్త, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బళ్ల గంగయ్య భట్ట దివాకర్ జనసేన పార్టీలో చేరారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సమక్షంలో వారు జనసేన కండువా కప్పుకున్నారు.
పెడన నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా సమన్వయకర్తలు అంకెం లక్ష్మీ శ్రీనివాస్, లింగం నాగేశ్వరరావు, విక్కుర్తి శ్రీనివాస్ బాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చేరికలు చోటుచేసుకున్నాయి. పట్టణంలో సుపరిచితమైన బళ్ల కుటుంబం జనసేనలో చేరడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ పరిణామంపై చర్చ మొదలైంది.
ఈ చేరికల కార్యక్రమంలో పార్లమెంట్ సమన్వయ సభ్యులు గరికపాటి శివ, ఇల్లూరి సుగుణ బాబు, పంచకర్ల సురేష్, నల్లమోతు రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. పెడనలో పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత సమన్వయంపై ఈ చేరికల ప్రభావం ఎలా ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
