జన గళం పెడన డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘం ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతూ.. పెడన మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్నారాణి గారితో పాటు పట్టణ పరిధిలోని కీలక నేతలు భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గార్ల సమక్షంలో ఈ చేరికల ఘట్టం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ అంకెం లక్ష్మీ శ్రీనివాసరావు, శ్రీ లింగం నాగేశ్వరరావు, శ్రీ విక్కుర్తి శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి బళ్ళ జ్ఞానలింగ జ్యోత్స్నారాణి గారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నాయకులు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు ఎన్డీయే కూటమి తరఫున పెడన మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఆమె బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పంచర్ల సురేష్, ఇల్లూరి సుగుణ బాబు, గరికపాటి శివ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పెడన మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావులతో పాటు పలువురు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కూటమి వైపు రావడంతో పెడన మున్సిపాలిటీ పరిధిలో కూటమి గెలుపు అవకాశాలు మరింత బలపడ్డాయి.
