జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమరంలో 32వ డివిజన్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీ అజయ్ వర్మ ఠాగూర్ గారు శనివారం లాంఛనంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న అజయ్ వర్మ ఠాగూర్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, జనసైనికులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. డివిజన్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే తన ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరుస్తూ 32వ డివిజన్లో భారీ మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
