జన గళం పెడన/మంగళగిరి డెస్క్: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల మలి జాబితాకు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం రాత్రి ఆమోదం ముద్ర వేశారు.
ఈ మలి జాబితాలో పెడన మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పెడన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా శ్రీమతి బళ్లా జ్ఞానలింగ జ్యోతి గారి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. స్థానిక సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ నుంచి ఇటీవలే జనసేనలో చేరిన బలమైన నేత బళ్లా గంగయ్య కుటుంబానికే మున్సిపల్ పగ్గాలు దక్కడంతో పెడన రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పెడన పురపాలక పీఠంపై కూటమి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచార బరిలోకి దిగుతున్నట్లు నాయకులు స్పష్టం చేశారు.
