జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని మంగినపూడి సాగర తీరాన కొలువుదీరిన అరవై మూడు అడుగుల సప్తమృత్తిక విజయ గణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. తీర ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభతో ఏర్పాటు చేసిన మహాగణపతి సన్నిధికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ వెంట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌తో పాటు జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
