జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ వేగంగా సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లా ఎన్నికల సమన్వయకర్త, రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల కమిటీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. నియోజకవర్గాలు, వార్డుల వారీగా పార్టీ బలాబలాలను అంచనా వేయడంతో పాటు క్రియాశీల జనసైనికులను కలిసి వారి నుంచి నేరుగా అభిప్రాయ సేకరణ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, గుండ్లూరు నాగరత్నం, నున్నే మల్లికార్జున యాదవ్ సహా సహాయక బృందం సభ్యులు గుణుకుల కిషోర్, షేక్ కరీం, దాడి అజయ్ కుమార్, పెంచల ప్రసాద్, దొరస్వామి, సాయి విఠల్, అల్లూరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కూటమి ఐక్యతను చాటుతూ జిల్లా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయ సమావేశంలో తమ్మిరెడ్డి శివశంకర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొని ఉమ్మడి ఎన్నికల కార్యాచరణపై సమాలోచనలు జరిపారు.
